TRENDING #దేవాలయాలు #పండుగలు #జీవనవిధానం #రామాయణం #మహాభారతం
📅

మన భవిష్యత్తు కోసం ప్రకృతిని కాపాడుకుందాం🙏

పబ్లిష్ తేదీ: Thursday, June 4, 2026


భారతీయ సనాతన ధర్మం ప్రపంచంలోని ఇతర సంస్కృతుల కంటే ప్రత్యేకమైనది. ఎందుకంటే మన పూర్వీకులు,మునులు, రాజ కుటుంబీకులు ప్రకృతిని కేవలం ఒక వనరుగా కాకుండా, దైవ స్వరూపంగా భావించారు. మన జీవితానికి ఆధారమైన  ప్రకృతి శక్తిని ఆధరించి దేవతారూపంలో ఆరాధించారు.

     సూర్యుడు సమస్త జీవకోటి మనుగడకు మూలం కాబట్టి ఆయనను సూర్యభగవానుడు అని పూజించాము. నదులను తల్లులుగా భావించి గంగామాత,యమునా మాత, కావేరి మాత, గోదావరి మాత, కృష్ణా మాత అని గౌరవించాము. భూమిని భూదేవిగా, ఆవును గోమాతగా పూజించాము.


      మొక్కలు కూడా మన సంస్కృతిలో దైవ స్థానం పొందాయి. తులసికి లక్ష్మీదేవి స్వరూపంగా ఇంట్లో చోటివ్వడం జరిగింది, రావి చెట్టును పవిత్ర వృక్షంగా బావించి గుడిలో పూజించడం మొదలుపెట్టారు, వటవృక్షాన్ని దీర్ఘాయుష్షుకు ప్రతీకగా భావించాము. నాగు పాములను, పక్షులను, పశువులను, జంతువులను కూడా దేవతల వాహనాలుగా గౌరవించాము.

    పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం లేకుండా మానవుడు జీవించడం అసాధ్యం. అందుకే వీటిని పూజించే సంప్రదాయాన్ని మన పూర్వీకులు ఏర్పరిచారు. ఈ ఆచారాల వెనుక మూఢనమ్మకం కాదు, ప్రకృతి పరిరక్షణ అనే గొప్ప సందేశం దాగి ఉంది.

    నేడు ప్రపంచం పర్యావరణ సంక్షోభాలను ఎదుర్కొంటున్న సమయంలో, వేల సంవత్సరాల క్రితమే ప్రకృతిని దైవంతో మమేకం చేసిన భారతీయ సంస్కృతి ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది. ప్రకృతిని ప్రేమించడం అంటే దైవాన్ని ప్రేమించినట్టే అని మన సనాతన ధర్మం బోధిస్తోంది.

         "ప్రకృతి దేవుని సృష్టి మాత్రమే కాదు; సనాతన భారతీయ దృష్టిలో ప్రకృతియే దైవ స్వరూపం." 


Save_Nature
                     ప్రకృతిని ప్రేమిద్దాం

ప్రపంచ పర్యావరణ దినోత్సవం:

        ప్రతి సంవత్సరం జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ దినోత్సవం ద్వారా పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడం ప్రధాన ఉద్దేశ్యం. పెరుగుతున్న కాలుష్యం, అడవుల నరికివేత, వాతావరణ మార్పులు మరియు ప్లాస్టిక్ వ్యర్థాలు భూమికి తీవ్రమైన ముప్పుగా మారుతున్నాయి.

       మనిషి అభివృద్ధి కోసం ప్రకృతిని అధికంగా వినియోగించడం వల్ల ప్రకృతి సమతుల్యత దెబ్బతింటోంది. చెట్లు తగ్గిపోవడం, భూమి సారం కోల్పోవడం, ఎండలు తీవ్రం అవడం, కాలాలకు సంబంధం లేకుండా వర్షాలు, అభివృద్ధి పేరుతో పరిశ్రమలను స్థాపించి నదులను కలుషితం చెయ్యడం, గాలి నాణ్యత క్షీణింప చెయ్యడం వంటి సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వీటి ప్రభావం మన ఆరోగ్యంపై, వ్యవసాయంపై మరియు జీవ వైవిధ్యంపై పడుతోంది.

       పర్యావరణాన్ని రక్షించడం ప్రతి పౌరుడి బాధ్యత. ప్రతి ఒక్కరూ ప్రతీ సంవత్సరం కనీసం ఒక మొక్కను నాటడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, ప్రతీ ఇంటికి ఒక ఇంకుడుగుంత తవ్వుకోవడం ద్వారా నీటిని ఆదా చేయడం మరియు పరిశుభ్రతను పాటించడం ద్వారా ప్రకృతి సంరక్షణలో భాగస్వాములు కావచ్చు.

ముగింపు:

      ఈ పర్యావరణం మనకు వారసత్వంగా వచ్చిన సంపద కాదు,  భవిష్యత్ తరాల నుండి మనం అప్పుగా తీసుకున్న ఆస్తి. కాబట్టి ప్రకృతిని ప్రేమించి, పర్యావరణాన్ని కాపాడి, భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన భూమిని అందించడం మనందరి కర్తవ్యం.

    "ప్రకృతిని కాపాడితేనే భవిష్యత్తు సురక్షితం."

🪔

మీ పవిత్ర అభిప్రాయాన్ని పంచుకోండి

ఈ ఆధ్యాత్మిక కథనం లేదా శ్లోకంపై మీ అమూల్యమైన స్పందనను తెలియజేయండి. మీ అభిప్రాయం మాకు ఎంతో విలువైనది.